Tuesday 19 August 2014

సోవియట్ తెలుగు పుస్తకాలు - జ్ఞాపకాలు by నాగరాజు అవ్వారి [11-aug-2014]

ఉక్రేనియాలో సంఘర్షణ గురించి వార్తలు చదువుతున్నప్పుడు అసంకల్పితంగానే టాల్‍స్టాయ్ రాసిన "కోసక్కులు"  నవల గుర్తుకొస్తుండేది. కోసక్కులు అత్యధికంగా ఉక్రేయిన్‍లోనే ఉంటున్నారు. ఈ ఙ్ఞాపకాలను సరిచూసుకొనేందుకు పుస్తకాల గూళ్ళను దులిపి కొసక్కులు నవల బయటకు తీసాను. దుమ్ముకొట్టుకపోయిన పుస్తకపు లోపలి అట్ట మీద పది రూపాయల ధర అంటించి ఉంది. పది రూపాయలకు ఇంత మంచి నవలా అనిపించగానే లోపల తెరలాగా ఏదో కదిలినట్టనిపించింది. అది కూడా పుస్తకం ముద్రించినప్పటి ధర కాదు. తొంబయ్యయిదు, ఆ ప్రాంతంలో - ఇంకా మిగిలి ఉన్న సోవియట్ ప్రచురణలు విశాలాంధ్ర పుస్తకాల షాపుల్లో పనికిరాని మూలల్లోకి, అటకల్లాంటి చోట్లల్లోకి చేరుకుంటున్న సమయంనాటికి నిర్ణయించిన ధర. 

గబగబా పుస్తకాన్ని దులిపి చదవడానికి మొదలు పెట్టగానే ఒక విషయాన్ని సరిచేసుకోవాలని తెలిసి వచ్చింది. భౌగోళిక రీత్యా కొసక్కులు ఉక్రేయిన్‍లోఅత్యధికంగా ఉన్న మాట నిజమే గానీ, నవల కథా స్థలమంతా టెరెక్ నదీ పరివాహక ప్రాంతంలో జరుగుతూ ఉంటుంది. ఏదైనా పుస్తకం చదువుతున్నప్పుడు, కదులుతున్న పేజీలకు సమాంతారంగా అనేక ఊహలు, కథనాలు, సంభాషణలూ , దృశ్యాలు సాగుతుండడం ఎప్పుడూ అనుభవంలో ఉండేదే. ఈ సారి కూడా అలాంటి అనుభూతులే కళ్ల ముందర తారట్లాడాయి.

అలాంటి ధారలో మొదటి దృశ్యం- అది నేను కొన్న మొదటి కాపీ కాదనీ, రెండవదనీ గుర్తుకు చేసింది. మొదటి కాపీని కర్నూలు ప్రాంతానికి చెందిన ఒక అమరుని తమ్ముడు చదువుతానని ఇప్పించుకొని, ఇక కన్పించకుండా పోగా,  చదువుకోవడం కోసం విజయవాడ విశాలాంధ్ర పుస్తకాల షాపులో మళ్ళీ కొన్నాను. ఆ తర్వాత దృశ్యం నన్ను నా బాల్యానికి, ముఖాలు స్పష్టాస్పష్టంగా అలుముక పోయిన ఙ్ఞాపకాల్లోకీ, మొట్టమొదట సోవియట్ పుస్తకాలను చూసిన అనుభవాల్లోకీ తీసుకపోయింది. 

 అక్కడ నేను తొలిసారిగా అనేక గదులూ, విశాలమైన ఆటస్థలమూ ఉన్న హైస్కూల్‍లోకి అడుగు పెట్టాను. ఎంతో మంది విద్యార్దులూ, తీర్చిదిద్దినట్టూ మొక్కలతో, చెట్లతో ఉన్న ఆవరణలో అంతా సంభ్రమంగానూ, భయంగానూ పరికిస్తూ ఉన్నాను. అప్పటి దాకా చిన్నపాటి వీధి బడులలో, ఇంటి వసారాలలో పదీ, పదైదు మంది పిల్లలకు మించని వాతావరణంలో చదువుకున్న నాకు ఇది ఊపిరి సలపనివ్వని అనుభవం. వీటన్నింటీకీ తోడు ఈత బెత్తాలు మోపులకు మోపులు వీపుల మీద విరగ్గొట్టే వాళ్ళూ. చెవులు పట్టుకొని పైకెత్తి నేలకు విసిరే పంతుళ్ళనూ తొలిసారి చూసాను. 

ఈ భయ విభ్రమాయుత వాతావరణంలో నాకు మొదటి నుండీ  కాస్త స్వాంతన కలిగించేంది నా చదువుకునే అలవాటే. తరగతి పుస్తకాలకు దూరంగా ఊరి గ్రంథాలయంలో వెతుక్కుంటూ, వెతుక్కుంటూ చదువుకున్న పుస్తకాలే.

తొలిసారిగా సోవియట్ పుస్తకాలను చూసిన సందర్భం గుర్తుకు వచ్చినప్పుడు నాకు సన్నగా, కళ్ళద్దాలతో, చేతిలో పుస్తకాలు పెట్టుకొనే పెట్టెతో ఉండే నిలోవ్నా అనే పిల్ల గుర్తుకొస్తుంది. ఆ పిల్ల అలా పుస్తకాల కోసం ఒక పెట్టె ప్రత్యేకంగా మోసుకరాకపోయి ఉంటే, చిన్న పాటి గోనెసంచి లాంటి దానిలో పుస్తకాలు మోసుక తిరిగే నాబోటి వాడికి ఆ పిల్ల చచ్చినా గుర్తుండేది కాదు. అందునా అలాంటి నోరు తిరగని నిలోవ్నా అనే పేరు కూడా.

అదుగో, ఆ పిల్ల దగ్గరే నేను మొదటి సారి లేత ఆకు పచ్చరంగులో, మందపాటి అట్టతో ఉన్న "చిన్న మట్టి ఇల్లు" చూసాను. ఇంకా "భయం లేని వీత్యా " లాంటి పుస్తకాలను- ఆ పిల్ల మహారాణిలాగా దర్జాగా తోటి పిల్లల మధ్య తిరగేస్తూ ఉంటే, ఆ ఙ్ఞాపకం ఇంకా ఇప్పుడే జరుగుతూ ఉన్నట్లుగా కళ్ళముందర కదలాడుతున్నట్టుగా ఉంది. అప్పుడు బహుశా ఆ పిల్ల తల వెనుక ఒక కాంతి చక్రమేదైనా తిరుగుతూ ఉండేదేమోనని నా అనుమానం. లేకుంటే అంత మంది పిల్లలు ఆ పిల్ల చుట్టూ మూగేవాళ్ళు కాదు. అంత మంది పిల్లలకు ఆ పుస్తకాలను తాకి, చదివగలిగే అదృష్టం వరించినా నాకు మాత్రం అది చాలా కాలం ఊరిస్తూనే ఉండిపోయింది. అనామకంగా సమూహాలకు ఎడం ఎడంగా తిరిగే స్వభావం నన్ను వాటికి దూరం చేసింది. అయితే "సోవియెట్ భూమి" పుస్తకాన్ని మాత్రం నేను చూడగలిగాను. తాకి ముట్టుకోగలిగాను. విలక్షణమైన మందపాటి పేజీలతో, ప్రత్యేకమైన  పొడవు వెడల్పులతో ఉన్న ఆ పుస్తకాన్ని ఆ పిల్ల ఎంతో ఉదారంగా తన తోటి పిల్లల పుస్తకాలకు అట్టలు వేసుకోను తీసుకొని వచ్చేది. అవి ఆ చేయి ఆ చేయి దాటి నాదగ్గరకు కూడా రావడంతో నేను వాటిని నాకున్న మిడి మిడి ఙ్ఞానంతో "పఠించ"డానికి కూడా ప్రయత్నించడం ఇప్పుడు గుర్తుకొస్తోంది. 

సోవియట్ పుస్తకాలను చదవాలనే నా కల చాలా ఏండ్ల తరవాతగానీ తీరలేదు. అయితే అప్పటికే సోవియట్ పుస్తకాల ముద్రణ ఆగిపోయి ఉన్నది. సోవియట్ యూనియన్ పతనం అయిపోయి ఉంది. అయినా ఈ కారణాలేవీ నన్ను సోవియట్ పుస్తకాలకు దూరం చేయలేక పోయాయి. మిత్రుల సంభాషణలలోనూ, వారి ఇండ్లలోనూ, ఇంకా అరకొరా మిగిలి, అమ్మకానికి ఉన్న పుస్తకాలు నాకు ఆయా కొత్త లోకాలనూ, రష్యన్ సాహితీ మూర్తుల సృజననూ పరిచయం చేసాయి. 

అయినా ఇప్పటికీ చాలా మంది సంభాషణలలో చిన్నప్పుడే తాము ఫలానా పుస్తకాలను చదివామని అంటూ ఉన్నప్పుడు నాకు కాస్త అసూయగానే  ఉంటుంది. చిన్నప్పుడు అటువంటి సౌకర్యానికి నేను నోచుకోకపోయానే అని బాధగా ఉంటుంది.

ఇలాంటి ఙ్ఞాపకాలన్నింటినీ తేనెతుట్టెలా రేపిన కొసక్కులు నవల గురించి ఒక మాట చెబితేగానీ, నేను చెప్పలనుకున్నది పూర్తి కాదు. కొసక్కు నవల గురించిన నా ఙ్ఞాపకం ఒక దృశ్యంతో ముడిపడి ఉంది. 
యెరోష్కా మామ నవలా నాయకుడు ద్మిత్రీ ఒలెనీన్‍ను ఒక రోజు అడవిలోని లోతట్టు చోటుకు దాదాపుగా మానవ స్పర్శ ఎరుగని ఒక చోటుకు తీసుక వెళతాడు. అక్కడ అప్పుడే ఒక మృగం విశ్రాంతి తీసుకొన్న తాజాగుర్తులు చెరగిపోకుండా ఉంటాయి. మరుసటి రోజు ఒలెనిన్ తాను ఒంటరిగా ఆ చోటుకు చేరుకుంటాడు. ఆ ప్రదేశపు నిగూఢతనూ, మనుషుల వల్ల కలిగే ఇతరేతర మాలిన్యాలు లేకపోవడమూ తిరిగి అతనిని అక్కడకు ఆకర్షిస్తుంది. అతను అక్కడ తచ్చాడుతూ ఉండగానే పొద్దు వాటారుతుంటుంది. ఈ మార్పు అతనిలో భయాన్ని రేకిత్తిస్తుంది. ఒక వైపు ఆకర్షణ- మరో వైపు భయం ఈ ద్వైదీ భావంతో అతను అక్కడ నుండి నిష్క్రమిస్తాడు . కానీ తాను దారి తప్పుతాడు. ఎట్టకేలకు తన కుక్క సహాయంతో అతను తిరిగి తాను ఉంటున్న ప్రదేశపు సమీపానికి చేరుకోగలుగుతాడు.

నిగూఢంగానూ, లోతుగానూ ఉన్న ఈ దృశ్యం తాలూకు అనుభూతి చాలా రోజుల పాటు నాలో నిక్షిప్తమై ఉంది. దీని తాలూకు స్పృహ నాలో ఎంత పచ్చిగా ఉండేదంటే నేను త్వరగానే గందరగోళానికి లోనయ్యాను. ఈ దృశ్యం కొసక్కులలోనిదా, లేకుంటే తుర్గనేవ్, తండ్రులూ-కొడుకులలోనిదా అని సంశయానికి గురయ్యాను. తిరిగి దాన్ని తరచి చూసుకున్న దాకా నాకు ఊపిరాడలేదు.

కొసక్కులలోని ఈ దృశ్యం బహుశా ఆ నవలను అనుభూతిలోనికి తెచ్చుకోవడానికి కేంద్రస్థానం లాంటిదని నా అనుమానం. యవ్వనంలో తన సమాజపు బోలుతనానికి దూరంగా కాక్‍సస్ ప్రాంతానికి వచ్చిన ఒలేనిన్ అక్కడి సమాజంలోనూ, ప్రకృతిలోనూ భాగం కావాలని ప్రయత్నించడం , అతని ప్రేమ - వాటికి వ్యతిరేక దిశలో అతని సామాజిక స్థితి పరస్పరం తలపడడాన్ని పై సంఘటన సంకేతబద్దం చేస్తోంది.

 కవితాత్మకమైన, యవ్వనభరితమైన, అన్వేషణాయుతమైన ఈ చిన్ని నవల టాల్‍స్టాయ్ ఆత్మకథాత్మక నవల కూడా. సమాజం పట్ల రచయితకున్నపేచీ ఏమిటో ఈ నవల ద్వారానే  పాఠకుడు తెలుసుకోగలుగుతాడు. కాబట్టే ఈ నవల టాల్‍స్టాయ్‍ ఇతర రచనలకు,ఆయన జీవితానికీ ఒక పీఠికలాగా ఉపకరిస్తుందని నా నమ్మకం. 
సోవియట్ పుస్తకాలు మన భాషలో లేకుంటే  ఇట్టాంటి కిటుకులు మనం కనిపెట్టగలిగే వాళ్ళమేనా? 
ఇంతకూ ఆ రంగు రంగుల ప్రపంచాలను తన చుట్టూ గొప్పగా ప్రదర్శించిన ఆ పిల్ల ఇప్పుడు  ఎక్కడ ఉందో? ఏం చేస్తుంటుందో?

సోవియట్ తెలుగు అనువాదాల చరిత్ర, జ్ఞాపకాలు - స్వేత్లానా ద్జేంత్

 సోవియట్ తెలుగు అనువాదాల చరిత్ర, జ్ఞాపకాలు - స్వేత్లానా ద్జేంత్   ప్రగతి ప్రచురణాలయం, మాస్కో, యూ.యస్.యస్.ఆర్, తెలుగు విభాగపు మాజీ అధిపతి ***...