Thursday 14 May 2015

ప్రాచీనాంధ్ర గ్రంధమాల!!! by Uma Nuthakki

Courtesy: Uma Nuthakki face book page, thanks.

ప్రాచీనాంధ్ర గ్రంధమాల!!!

-----------------------------


ఆ దుకాణంలోకి వెళ్ళగానే పాతపుస్తకాల పరిమళాలు మనల్ని పలకరిస్తాయి..
మీరు ఎప్పటినుండో వెతుకుతున్న అరుదైన పుస్తకం... అది ఎన్నో దశాబ్దాలనాటి మాస్కో రాదుగ వారి పుస్తకం కావచ్చు.. "ఇదిగిదిగో నేనిక్కడున్నా" అంటూ మిమ్మల్ని ప్రేమగా పలకరిస్తుంది.
వాటి వెనుకే ఉంటారాయన!! నర్రా జగన్మోహన రావు గారు. పుస్తకాల మీద పల్చగా పరుచుకున్న దుమ్ముని సున్నితంగా తుడుస్తూనో..
కొత్తగా వచ్చిన పాత పుస్తకాలని అంశాలవారిగా సర్దుతూనో.. కాస్త పాడయిన వాటికి అట్టలు వేసి పేర్లు రాస్తూనో..
బొల్డన్ని పాత పుస్తకాలని జీవంపోసి పుస్తక ప్రియుల చేతుల్లో పెట్టిన వైద్యుడాయన.
రాష్ట్రంలో పాత పుస్తకాల దుకాణాలు చాలానే ఉండవచ్చు. విజయవాడ లెనిన్ సెంటర్లో అయితే కాలువ ఒడ్డున పాతపుస్తకాల దుకాణాలకి కొదవలేదు. అయితే "ప్రాచీనాంధ్ర గ్రంధమాల" విశిష్టత అంతా జగన్మోహనరావు గారి వల్లే!!
స్వయంగా ఆయన సాహిత్యాభిమాని కావడం అందులో గొప్పతనం. మనం ఏపుస్తకమైనా అడగనివ్వండి. అది మన చేతిలో పెట్టే వరకూ ఆ పుస్తకం గురించి రచయిత గురించి మనకి తెలియని ఎన్నో కబుర్లు చెప్తారాయన.
ఆయనలో ఇంకో గొప్పతనం ఏమిటంటే.. చూస్తూనే మనలో ఉన్న సాహిత్యాభిలాషని అంచనా వేసేస్తారాయన. ఏ పుస్తకం అడిగినా ముందు "లేదు" అన్నా... మన మొహంలో కదిలే నిరుత్సాహం తట్టుకోలేరు నర్రా వారు. మన ఫోన్ నంబర్ తీసుకొని.. ఎన్ని రోజుల తర్వాత అయినా ఆ పుస్తకాన్ని ప్రేమగా మన దగ్గరకి చేరుస్తారు.
మీరు పుస్తకాభిమాని అయితే.. విజయవాడ వెళ్ళినప్పుడు.. ఒక అరగంట "ప్రాచీనాంధ్ర గ్రంధ మాల" లో నర్రా వారితో గడపండి.
మంచి మంచి ఓల్డ్ (గోల్డ్) పుస్తకాలతో పాటు... ఆయనతో మాట్లాడాక ఒక మంచి ఫీలింగ్ మూట కట్టుకుని రాకపోతే అప్పుడు నన్నడగండి...
బారిష్టర్ పార్వతీశం మొదటి ముద్రణతో మూడు భాగాలుగా అలాగే వచ్చేసాడు నా దగ్గరకి!!
ఇంకా బోలెడన్ని రష్యన్ పుస్తకాలు కూడా!!



సోవియట్ తెలుగు అనువాదాల చరిత్ర, జ్ఞాపకాలు - స్వేత్లానా ద్జేంత్

 సోవియట్ తెలుగు అనువాదాల చరిత్ర, జ్ఞాపకాలు - స్వేత్లానా ద్జేంత్   ప్రగతి ప్రచురణాలయం, మాస్కో, యూ.యస్.యస్.ఆర్, తెలుగు విభాగపు మాజీ అధిపతి ***...