Monday 7 November 2016

ఉద్వేగానికి లోనయ్యా...

ఉద్వేగానికి లోనయ్యా...
--------------------------

సోవియట్‌ యూనియన్‌ మనుగడలో ఉన్న కాలంలో ఎన్నో అద్భుతమైన పుస్తకాలు మన తెలుగు నేలను ముంచెత్తాయి. అక్టోబరు విప్లవం గురించి, దాని నేపథ్యంలో వచ్చిన సాహిత్యం, సైన్స్‌, చరిత్ర, తత్వశాస్త్రం, కళలు ఒకటేమిటి.. అనేక అంశాల మీద వెలువడిన పుస్తకాలు మన తెలుగు నేలను పునీతం చేశాయి. అవన్నీ అప్పటి తరానికి మార్గదర్శకాలుగా పనిచేశాయి. అయితే ఇప్పటి తరానికి సోవియట్‌ పుస్తకాల గురించి చాలా తక్కువ మాత్రమే తెలుసు.
పాత తరంవారు దాదాపు వాటి గురించి మరిచిపోయిన క్రమంలో మళ్లీ ఆ పుస్తకాలను వెలుగులోకి తెచ్చే ప్రయత్నంలో మునిగి తేలుతున్నాడు ఓ యువకుడు. అతగాడ్ని చూస్తే ఈ పిలగాడేనా ఇంతపని చేస్తున్నది అనిపించక మానదు. అనిల్‌ బత్తుల అనే ఈ కుర్రోడికి ఇప్పుడు సోవియట్‌ పుస్తకాల గురించి ప్రచారం చేయడమే పని. అందుకు వాహికగా ఫేస్‌బుక్‌ను వాడుకుంటున్నాడు. పాత సోవియట్‌ సాహిత్యాన్ని పిడిఎఫ్‌ రూపంలోకి మార్చి ఫేస్‌బుక్‌లో ఉంచుతున్నాడు. తెలిసిన వారందరికీ మెయిల్‌ చేస్తున్నాడు. ఇంకాస్త ముందుకు వెళ్లి డబ్బు ఖర్చుపెట్టి జిరాక్స్‌ తీయించి స్పైరల్‌ బైండింగ్‌ చేసి ఇస్తున్నాడు.
ఇతగాడి వ్యవహారం తెలిసి 'సోపతి' ఫోన్‌ చేసింది. ఏం బిడ్డా మస్తుగ చేస్తున్నవ్‌గదా నీ కృషి గురించి నాలుగు మాటలు చెప్పు అంది. ''ప్రపంచాన్ని మార్చివేసిన గొప్ప విప్లవం అక్టోబరు విప్లవం.. ఆ విప్లవం మార్క్సిజాన్ని మొదటిసారిగా ఆచరణాత్మకమైనదని ఎలుగెత్తి చాటింది. ఆ విప్లవ భావజాలంతో వచ్చిన అనేక పుస్తకాలు మన తెలుగులోకీ అనువదించబడ్డాయి. వాటిని చదివి ఎంతో ఉద్వేగానికి లోనయ్యాను. ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఈ సాహిత్యం మన తెలుగు జీవితాలపై ఎట్లాంటి ప్రభావం చూపిందో చెప్పడానికి ఒక్క తెలంగాణ సాయుధపోరాటం చాలు. మహీధర, దాశరథి, శ్రీశ్రీ వంటి ఎందరో మహా కవులు, రచయితలు ఈ పుస్తకాల ప్రభావానికి లోనయినవారే. ఇక నేనెంత? ఇప్పుడు ఈ పుస్తకాలను దాదాపు అందరూ మరిచిపోయారు. మళ్లీ ఒక్కసారి ఈ జ్ఞాన భాండాగారాలను జనంలోకి తీసుకెళ్ళాలనిపించింది. ఇది డిజిటల్‌ యుగం. అందుకే ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌ మీడియాను ఉపయోగించుకుని ఈ పుస్తకాలను త్వరగా ఎక్కువ మందికి రీచ్‌ అయ్యేలా చూస్తున్నా''నని చెప్పుకొచ్చాడు.
యువతలో పది శాతమన్నా ఇట్లా ఆలోచిస్తే దేశం ఎట్లా మారిపోతుందో!
(అనిల్‌ బత్తుల సోవియట్‌ సాహిత్యం కోసం ఒక బ్లాగ్‌ నడుపుతున్నాడు. దానిపేరు...
sovietbooksintelugu.blogspot.in)
Sunday sopathi, 06 October 2016

సోవియట్ తెలుగు అనువాదాల చరిత్ర, జ్ఞాపకాలు - స్వేత్లానా ద్జేంత్

 సోవియట్ తెలుగు అనువాదాల చరిత్ర, జ్ఞాపకాలు - స్వేత్లానా ద్జేంత్   ప్రగతి ప్రచురణాలయం, మాస్కో, యూ.యస్.యస్.ఆర్, తెలుగు విభాగపు మాజీ అధిపతి ***...